అమరావతి, వార్తానిధి: ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని పరిచయం చేసింది. దాని ద్వారా అన్ ఆర్గనైజ్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కు ఊతమిచ్చేందుకు నిర్ణయించి పథకాన్ని అమల్లోకి తెచ్చింది. పీఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా చిన్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఆర్థిక, సాంకేతిక, వ్యాపార సంబంధమైన మద్ధతును ఈ పథకం అందిస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో కూడా పథకం అమలు జరిగింది. అందుకోసం జిల్లాలవారీగా డీఆర్పీలను నియమించారు. నియామక సమయంలో ముందుగా ఇన్సెంటివ్ ల ఆధారంగా విధులు నిర్వహించాలని, తరువాత ఫుల్ టైం ఉద్యోగం క్రింద ఇది మారుతుందని నియామక ఏజెన్సీ వారు నమ్మబలికారు. వారి మాటలను నమ్మి కొందరు ఔత్సాహికులు తమకు ఉద్యోగం లభిస్తుందనే ఆశతో డీఆర్పీలుగా చేరారు. పథకంలో ఎంతో మంది చిన్నతరహా ఆహార ఉత్పత్తిదారులను భాగస్వాములను చేశారు. వారి పథకం ద్వారా లబ్ధి చేకూర్చేందుకు సహకరించారు.
అంతా బాగానే ఉన్నప్పటికీ తొలుత ఇన్సెంటివ్స్ ఇచ్చిన నియామక సంస్థ తరువాత ఇవ్వడం మానేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత ఐదు నెలలుగా వారికి చెల్లించాల్సిన ఇన్సెంటివ్స్ కూడా చెల్లించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెగ్యులర్ ఉద్యోగం పేరిట మోసగించడమే కాకుండా, ఇప్పుడు ఇన్సెంటివ్స్ చెల్లింపులో కూడా మోసపూరితంగా వ్యవహరించడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎంఎఫ్ఎంఈ పథకం అమలు కోసం కోట్లాది రూపాయలు మంజూరు అవుతుండగా, అవి నిజమైన లబ్ధిదారులకు అందుతున్నాయా అనే సందేహాలు కలుగుతున్నాయి. అందులోనూ ఎవరైనా పథకాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళారో వారికే అన్యాయం జరగడం అనుమానాలను మరింత బలపరుస్తోంది.
దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ జరిపించి డీఆర్పీలకు న్యాయం చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇచ్చిన మాట ప్రకారం వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, ఇన్సెంటివ్స్ తో పాటు జీతం కూడా ఇవ్వాలనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. అదే విధంగా ఎటువంటి షరతులు లేకుండా డీఆర్పీలకు చెల్లించవలసిన ఇన్సెంటివ్స్ ను కూడా తక్షణ చెల్లించాలని డీఆర్పీల నుంచి ప్రభుత్వానికి వినతులు వస్తున్నాయి. ఊరించి ఉసురూమనిపించడం సరికాదనే ఆవేదనలు వ్యక్తమవుతున్నాయి. మరి డీఆర్పీల వినతిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
#PMFME #AP #Amaravati #funds #DRP #CBN