హైదరాబాద్, వార్తానిధి: 317 జీఓ సవరణ చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు నిరవధిక నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
అయితే ప్రభుత్వం సవరణ చేపట్టే వరకు తమ కార్యక్రమాలను కొనసాగిస్తామని సంఘం ప్రకటించింది. అందుకు ప్రత్యేక కార్యాచరణను వెల్లడించింది.
ఈ విషయమై తపస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎస్.జనార్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బొడ్డు రవి వివరాలను వెల్లడించారు. రాష్ట్ర శాఖ నిర్ణయం మేరకు సీఎంతో పాటు సీఎస్‌కు మెయిల్స్ పంపించినట్లు తెలిపారు.
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న మహాధర్నా తలపెట్టామని వారు చెప్పారు. 317 జీఓ ఉద్యోగ, ఉపాధ్యాయులందరినీ మానసిక క్షోభకు గురి చేసిందని అన్నారు.
కొందరు ఉపాధ్యాయులు తమ ప్రాణాలను కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ప్రభుత్వంలో చలనం లేకుండా పోయిందన్నారు.
సవరణలు చేయకుండా 317 జీఓను అమలు చేయాలని ప్రభుత్వం మొండిగా వెళ్తుండడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ మేరకు సవరణలు చేయాలని కోరారు.
స్థానికత కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి స్వరాష్ట్రంలో నెలకొనడం బాధాకరమని చెప్పారు. తపస్ తలపెట్టిన ఉద్యమ కార్యాచరణలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు.
ఉద్యమాన్ని విజయవంతం చేసి హక్కులను సాధించుకుందామని కోరారు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని అన్నారు.
జనవరి 26న ప్రతి నియోజకవర్గంలో శాసనసభ్యులకు ఉద్యోగ, ఉపాధ్యాయులు వినతి పత్రం ఇవ్వాలన్నారు.
జనవరి 28 నుంచి 30వ తేదీ వరకు సంతకాల సేకరణ చేయాలన్నారు.
జనవరి 31న సంతకాలు చేసి వాటిని గవర్నర్, సీఎం, సీఎంఓ, సీ అండ్ డీఎస్ఈ, విద్యాశాఖ మంత్రికి మెయిల్ చేయాలని కోరారు.
ఫిబ్రవరి 12న కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరిగే మహాధర్నాలో పాల్గొనాలని ఉద్యోగ, ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
కార్యక్రమాలన్నింటినీ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరపాలని విజ్ఞప్తి చేశారు.