రంగారెడ్డి జిల్లాలో స్థానిక ఉపాధ్యాయులకు స్థానికత లేకుండా చేయడమే కాకుండా.. Go 317 నెపంతో సీనియారిటీ అడ్డం పెట్టుకొని కొందరు ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి క్యాడర్ స్ట్రెంత్ కు మించి రంగారెడ్డి జిల్లాకు వచ్చారు. వివిధ రకాల పైరవీలతో ప్రెసిడెన్సియల్ ఆర్డర్ PO 2018 కు విరుద్ధంగా పోస్టులను పొందారు. ఇంకా చాలా మంది వివిధ మార్గాల ద్వారా వస్తూనే ఉన్నారు. ఇలా అదనంగా వచ్చిన వారిని వెనక్కి పంపాలని సేవ్ రంగారెడ్డి ఉద్యమ సంస్థ గత రెండు ఏండ్లుగా పోరాటం చేస్తోంది.
Go 317 అమలు సమయంలో అన్ని జిల్లాలలో క్యాడర్ స్ట్రెంత్ కు మించి ఉపాధ్యాయ కేటాయింపులు జరిగాయి. ఇలా కేటాయింపులు చెయ్యడం వలన స్థానిక నిరుద్యోగ యువకులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. కావున రంగారెడ్డి జిల్లాలో అదనంగా కేటాయించిన వారిని వారి సీనియారిటీ ప్రకారం వారికి ఏ జిల్లా అయితే వర్తిస్తుందో ఆ జిల్లాను మాత్రమే కేటాయించాలి.
ఈ Go 317 కేటాయింపులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోవడం వలన కూడా రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ కోటాకు భంగం వాటిల్లింది. లోపభూయిష్టంగా విద్యాశాఖలో అమలు చేయడం వలన స్థానిక ఉపాధ్యాయులు, నిరుద్యోగులు నష్టపోవాల్సి వస్తోంది.
సుమారు 500ల మంది ఉపాధ్యాయులు Go 317 దుర్వినియోగపరుస్తూ జిల్లాకు రావడం వల్ల నిరుద్యోగులు సైతం నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రంగారెడ్డి జిల్లాకు Go 317 వాడుకొని వచ్చిన అదనపు ఉపాధ్యాయులను పంపిస్తే స్థానిక జూనియర్ ఉపాధ్యాయులకు లబ్ధి చేకూరుతుంది. అంతేకాకుండా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు కూడా న్యాయం జరుగుతుంది.
మహబూబ్ నగర్ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాలో కలిసిన 10 మండలాలకు Go 317 ద్వారా కేటాయించిన ఉపాధ్యాయుల క్యాడర్ స్ట్రెంత్ తయారుచేసి అంతే మంది ఉపాధ్యాయులను రంగారెడ్డి జిల్లాకు కేటాయించాలి. ఈ కేటాయింపులలో అదనంగా ఉన్నటువంటి జూనియర్ ఉపాధ్యాయులను తిరిగి మహబూబ్ నగర్ జిల్లాకు పంపి రంగారెడ్డి జిల్లా క్యాడర్ స్ట్రెంత్ కాపాడాలని సేవ్ టీచర్స్ సంఘం విద్యాశాఖ అధికారులను కోరుతుంది.
కావున ప్రభుత్వం సత్వరమే ఈ అక్రమాలపై విచారణ చేయించి స్థానికత కోల్పోయిన స్థానికులకు న్యాయం చేయాలని సేవ్ టీచర్స్ సంఘం డిమాండ్ చేస్తున్నది. స్థానికులకు జరిగిన అన్యాయంపై న్యాయపోరాటంలో భాగంగా సేవ్ రంగారెడ్డి ఉద్యమ సంస్థ గౌరవ హై కోర్టులో కొన్ని కేసులు వేయడం జరిగింది. వాటి తుది తీర్పు వరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.
స్థానికత మా జన్మహక్కు అనే నినాదమే ఎజెండాగా స్థానికుల హక్కుల రక్షణనే ధ్యేయంగా సేవ్ టీచర్స్ సంఘం పని చేస్తుంది.
బొడ్డు రవి,
రాష్ట్ర గౌరవాధ్యక్షులు
Service Association for Visionary Teachers Telangana (SAVT)
సేవ్ టీచర్స్ సంఘం తెలంగాణ.