హైదరాబాద్, వార్తానిధి: రాజకీయ పార్టీలు విభజన రాజకీయాలతో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయని ముదిరాజ్ సంక్షేమ సమితి రాష్ట్ర కార్యదర్శి గోనెల కుమారస్వామి ఆరోపించారు. కుల గణన డిమాండ్లు, సమగ్ర ఇంటింటి సర్వే నేపథ్యంలో ఆయన కుల విభజనపై స్పందించారు. ప్రధానంగా బీసీలను రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న తీరును తప్పుబట్టారు. వెనుకబడిన వర్గాల పేరిట 1953 కాకా కేల్కర్ కమిషన్ మొదలుకొని నేటి వరకు రాజకీయాలే జరుగుతున్నాయని విమర్శించారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాలను గుర్తించేందుకు జనవరి 1, 1979 మండల్ కమిషన్ ఏర్పాటైందన్నారు. డిసెంబర్ 31, 1980లో నాటి రాష్ట్రపతి ఎన్.ఎస్.రెడ్డికి కమిషన్ తమ రిపోర్టును అందించిందని గుర్తు చేశారు. బీసీలకు 27శాతం రిజర్వేషన్లను కల్పించాలని మండల్ కమిషన్ సిఫారసు చేసిందన్నారు. అయితే అది ఆచరణలోకి రావడానికి మాత్రం 1993 వరకు వేచి చూడాల్సి వచ్చిందన్నారు. విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల కోసం బీసీలు 2006 వరకు వేచి చూడాల్సి వచ్చిందన్నారు. నేటికి కూడా చాలా వరకు విద్యా సంస్థల్లో బీసీలకు బోధన పోస్టింగుల్లో రిజర్వేషన్ నామ మాత్రంగానే ఉందని అభిప్రాయపడ్డారు.
బీసీల్లో ఐక్యత లేకుండా వారిని ఏ, బీ, సీ, డీ వర్గాలు విభజించారన్నారు. దాని వల్ల బీసీలకు న్యాయం జరగడం లేదన్నారు. నిజంగా న్యాయం జరిగి ఉంటే నేడు కుల సంఘాల పోరాటాలు అవసరం పడేవి కాదన్నారు. నేటికి కూడా బీసీల పేరిట రాజకీయాలు చేసే పార్టీలు బీసీలను కులాల పేరుతో ఏకం కాకుండా జాగ్రత్త పడుతున్నాయన్నారు. తద్వారా బీసీలను వర్గాలుగా విభజించి ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయన్నారు. నేటికి కూడా ఫీజు రియంబర్స్మెంట్లు, స్కాలర్షిప్ల కోసం బీసీ విద్యార్థులు రోడ్డుకు ఎక్కే పరిస్థితి ఉందన్నారు. కుల గణన పేరుతో నేడు నాటకాలాడుతున్న వారు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు బీసీల కోసం ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. బీసీలను పేదరికంలో ఉంచుతూ వారి సమస్యలను పరిష్కరించకుండా ఆ మంటతో చలి కాచుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత కులానికో భవనం, కులానికో పథకం పేరుతో అన్ని బీసీ కులాల వారిని మభ్యపెట్టి మాయ చేశారన్నారు. బీసీ డిక్లరేషన్ పేరుతో అధికారంలోకి వచ్చిన పార్టీ అసలు ఆ డిక్లరేషన్ ఊసెత్తే పాపాన పోవట్లేదన్నారు. బీసీలు కులాలకు అతీతంగా ఏకమైతేనే న్యాయం జరుగుతుందని, నా కులం వరకే అనుకుంటే మొదటికే మోసం వస్తుందన్నారు. ఏకమైతే ఎదుగుతామని, విడిపోతే అణగదొక్కబడతామన్నారు. రాజకీయ నాయకుల మాటలను కాదు చేతలను గమనించాలని బీసీ వర్గాల ప్రజలందరికి విన్నవించారు.
రాజకీయ చదరంగంలో పావులుగా మారి ఇప్పటికే కుల వృత్తిని ఇతరుల చేతుల్లోకి పంపామన్నారు. కుల పోరాటాల పేరుతో బీసీలకు బీసీలే శత్రువులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తామెవరికీ వ్యతిరేకం కాదని, కానీ తమకు న్యాయంగా దక్కాల్సిన అవకాశాల కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు బీసీలను విభజించి తమ పబ్బం గడుపుకునే ప్రయత్నం మానుకోవాలని గోనెల కుమారస్వామి హితవు పలికారు.
#BCcensus #Telangana #Samagraintintisurvey #Revanthreddy #BCdeclaration
Tags:
తెలంగాణ