న్యూదిల్లీ, వార్తానిధి: రాహుల్ గాంధీ ఈడీ దాడులకు గురించి చేసిన వ్యాఖ్యలపై బిజెపి నేత రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. కఠినమైన ప్రశ్నలు ఎదురైనప్పుడు రాహుల్ గాంధీ వద్ద సమాధానాలు ఉండవని, అటువంటి సందర్భంగా ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారన్నారు. ఇది కాంగ్రెస్ కు ఒక పరిపాటిగా మారిపోయిందని విమర్శించారు. మీడియా కూడా వారి రాగానికి రాగం కలుపుతూ తానా అంటే తందానా అంటోందని ఎద్దేవా చేశారు. వాయనాడ్ ల్యాండ్ స్లైడ్స్ విషయంలో సత్వరమే స్పందించకపోవడం, ఇన్నేండ్లు వాయనాడ్ కోసం ఏమి చేయకపోవడం వంటి వాటి నుంచి తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో ఇటువంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.
కేవలం అందరి దృష్టిని తన వైపు తిప్పుకునేందుకు విక్టిం కార్డును వాడుతున్నారని పేర్కొన్నారు. కొన్నిసార్లు ప్రజలను మోసం చేయవచ్చు గానీ, ప్రతిసారి మోసం చేయడం కుదరదని గుర్తించాలని రాహుల్ కు సూచించారు. ఇండి కూటమిలోని డీఎంకే అయినా కాంగ్రెస్ అయినా అవినీతిలో కూరుకుపోయాయని ఆరోపించారు. ప్రజాధనం లూటీ చేయడం, దాన్ని దుర్వినియోగం చేయడమే పనిగా పెట్టుకున్నాయన్నారు. ఒకవేళ చట్టం వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తే నిందలు వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
#BJP #Rajeevchandrashekar #Rahulgandhi #news #varthanidhi
Source : ANI news