బోడుప్పల్, వార్తానిధి: నివాస ప్రాంతాలు విద్యా సంస్థల సమీపంలో వైన్ షాపులు ఏర్పాటు చేయొద్దని నిబంధనలు సూచిస్తున్నాయి. కానీ కొందరు నిబంధనలను ఉల్లంఘించి నివాస ప్రాంతాలు, విద్యా సంస్థల సమీపంలో షాపులను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో నివాసితులు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ఇటువంటి దుస్థితే బోడుప్పల్ లో తలెత్తింది. బోడుప్పల్ కమాన్ నుంచి బోడుప్పల్ అంబేడ్కర్ విగ్రహం వైపు వెళ్లే ప్రధాన రహదారిలో శ్రీ సింధూర వైన్స్, లిక్కర్ మార్ట్ ను ఏర్పాటు చేశారు. అయితే లిక్కర్ మార్ట్ పక్కనే ఎస్.వి.ఎస్ ప్రైడ్, సీఎస్ఆర్ రెసిడెన్స్ నివాస భవనాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వైన్ షాప్ ఎదురు దారిలో కూత వేటు దూరంలోనే సిద్ధార్థ పబ్లిక్ స్కూల్, ఓ చిన్న పిల్లల ఆసుపత్రి కూడా ఉండడంతో నివాసితులతో పాటు పిల్లల తల్లిదండ్రుల్లోనూ ఆందోళన నెలకొంది. వైన్ షాప్ ను వేరే ప్రాంతానికి తరలించాలని గత కొంతకాలంగా నివాస ప్రాంతాలవారు ఆందోళన చేస్తున్నారు. మహిళలు సైతం రోడ్డు పక్కన టెంట్ వేసుకొని తమ నిరసన తెలుపుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్యల పరిష్కారం కావడం లేదని వాపోతున్నారు.
ఇదిలా ఉండగా సింధూర లిక్కర్స్ యాజమాన్యం వాదన మరోలా ఉంది. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు పొందిన తరువాతే తాము వైన్ షాప్ ఏర్పాటు చేసినట్లు చెబుతోంది. వివిధ ప్రాంతాల్లో సరైన స్థలం లభించలేదని, ప్రస్తుతం షాప్ ఉన్న స్థలాన్ని లీజుకు తీసుకొని రేకుల షెడ్డు వేసి ప్రారంభించామని తెలియజేసింది. ఇరు వర్గాల వాదన ప్రకారం ఉన్నతాధికారులు ఈ విషయంలో ఉన్నతాధికారులు కలుగుజేసుకొని నివాసితులు, విద్యార్థులతో పాటు వైన్ షాప్ యాజమాన్యానికి కూడా సరైన అభిప్రాయం చూపాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ అనుమతితోనే నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వమే ఇందుకు పరిష్కారం చూపాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Boduppal Wine shop Wines near School Hyderabad Locals Protest