హైదరాబాద్, వార్తానిధి: తెలంగాణ బిజెపి రాష్ట్ర పరిధిలో విజయ సంకల్ప యాత్రను చేపట్టేందుకు ఐదు క్లస్టర్లను రూపొందించింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పంచతంత్ర వ్యూహానికి పదును పెట్టింది. ఇప్పటికే రాజకీయ పార్టీలు, మేధావులు తెలంగాణను ఉత్తర, దక్షిణ, మధ్య, హైదరాబాద్ ప్రాంతాలుగా విభజించారు. బిజెపి కూడా వ్యూహాత్మకంగా ఐదు భాగాలను చేసి సొంత సోషల్ ఇంజనీరింగ్ ను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఫిబ్రవరి 20న ప్రారంభమైన విజయ సంకల్ప యాత్ర మార్చి 2న ముగియనుంది. ఈ యాత్ర 17 పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో 5,500ల కిలోమీటర్లు సాగనుండగా, 106 సమావేశాలు, 102 షోలను బిజెపి నిర్వహించనుంది. స్థానిక ఆచారవ్యవహారాలు, పరిస్థితులు, ప్రభుత్వాల వైఫల్యాలు ఇతరాత్ర అంశాలను పరిగణలోకి తీసుకొని పార్టీ ప్రచారాన్ని నిర్వహించనుంది.
కొమరం భీమ్ క్లస్టర్:
- ఈ క్లస్టర్ మూడు లోక్‌సభ నియోజకవర్గాలను కవర్ చేస్తుంది. అవి ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి.
- హైదరాబాద్‌లోని భూస్వామ్య నిజాంలకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజన వీరుడు కొమరం భీమ్ పేరు మీదుగా ఈ క్లస్టర్ పేరును పెట్టారు.
- ఈ ప్రాంతంలో సంఘ్ పరివార్ బలంగా ఉండడమే కాకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి అత్యంత విజయవంతమైన ప్రాంతంగా నిలిచింది.
- ఈ క్లస్టర్‌లో బీజేపీ 5 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది.
-మతపరమైన ఘర్షణలతో సున్నితమైన ప్రాంతంగా గుర్తింపు పొందిన భైంసా కూడా ఈ క్లస్టర్ పరిధిలోకి వస్తుంది.
రాజరాజేశ్వరి క్లస్టర్:
- ఇది నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలను కవర్ చేస్తుంది. అవి కరీంనగర్, జహీరాబాద్, మెదక్, చేవెళ్ల.
- వేములవాడ పట్టణంలో ఉన్న శ్రీ రాజ రాజేశ్వర దేవాలయం పేరు మీదుగా దీనికి ఆ పేరు పెట్టారు.
- ఈ ప్రాంతం భారత రాష్ట్ర సమితికి(బిఆర్ఎస్) బలమైన కోట.
- మాజీ సీఎం కె. చంద్రశేఖర్‌రావుకు చెందిన గజ్వేల్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావుకు చెందిన సిరిసిల్ల, మాజీ మంత్రి హరీశ్‌రావుకు చెందిన సిద్దిపేట వంటి నియోజకవర్గాలు ఈ క్లస్టర్ పరిధిలోనే ఉన్నాయి.
భాగ్యలక్ష్మి క్లస్టర్:
- చార్మినార్ భాగ్యలమ్మి అమ్మవారి పేరు మీదుగా ఉన్న ఈ క్లస్టర్ సికింద్రాబాద్, హైదరాబాద్, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాలను కవర్ చేస్తుంది.
-హైదరాబాద్ పేరును ‘భాగ్యనగర్’గా మార్చాలన్నది బీజేపీ చిరకాల డిమాండ్.
- చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి ఆలయం చుట్టూ వివాదాలు ఉన్నాయి.
- యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం భువనగిరిలో ఉంది.
- ఈ ప్రాంతంలో ఎంఐఎం ఉండటం వల్ల బిజెపికి ఓట్ల పోలరైజేషన్ జరిగే అవకాశాలున్నాయి.
కృష్ణమ్మ క్లస్టర్:
- ఈ ప్రాంతంలో ప్రవహించే కృష్ణా నది పేరు మీదు క్లస్టర్ కు నామకరణం చేశారు. ఈ క్లస్టర్ పరిధిలో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ పార్లమెంట్ స్థానాలున్నాయి.
- ఈ ప్రాంతం కాంగ్రెస్‌కు కంచుకోట లాంటిది. బిజెపి, దాని మిత్రపక్షాలు గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలలోనూ ఓటమిని చవి చూశారు.
- అయితే మహబూబ్‌నగర్ స్థానానికి బీజేపీ గట్టి పోటీనిస్తోందనే ధీమా బిజెపిలో కనిపిస్తోంది.
కాకతీయ-భద్రకాళి క్లస్టర్:
- వరంగల్ భద్రకాళి ఆలయంతోపాటు ఈ ప్రాంతాన్ని పాలించిన రాజవంథం పేరు మీదుగా ఈ క్లస్టర్ కు పేరును పెట్టారు. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం ఎంపీ స్థానాలు దీని పరిధిలోకి వస్తాయి.
- ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాలు కాంగ్రెస్ కు కంచుకోటలు కావడం ఇక్కడ గమనార్హం.
- ఈ క్లస్టర్ పరిధిలోనే భద్రాచలంలో ప్రసిద్ధ రామాలయం కూడా ఉంది.
- బిజెపి ఈ ప్రాంత సంస్కృతి, మతపరమైన ప్రాముఖ్యత చుట్టూ కథనాన్ని అల్లవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి, ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం కాకతీయ తోరణాన్ని అధికారిక చిహ్నం నుంచి తొలగించాలని నిర్ణయించిన నేపథ్యంలో దానిపై అధికంగా ప్రచారం జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
- ఈ ప్రాంతంలో కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఉనికి కనిపించలేదు.
#BJPTelangana #vijayasankalpayatra