మేడ్చల్ జిల్లా, వార్తానిధి: బోడుప్పల్ లోని వక్ఫ్ బాధితుల భూ సమస్యను పరిష్కరించాలని వక్ఫ్ బోర్డు బాధితుల ఐక్య కార్యాచరణ సమితి ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ల్యాండ్ రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, బోడుప్పల్ మున్సిపల్ కమీషనర్లకు సమితి కన్వీనర్ జిన్న శ్రీధర్ రెడ్డి వినతి పత్రాన్ని శనివారం సమర్పించారు. ఆయనతో పాటు కార్పొరేటర్ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.
తెలంగాణ వక్ఫ్ బోర్డు అనాలోచిత నిర్ణయం కారణంగా బోడుప్పల్ లోని దాదాపు 7వేల కుటుంబాలు ఆవేదన గురవుతున్నాయని అన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. హైదరాబాద్ కు సమీపంగా ఉన్న బోడుప్పల్ కాలక్రమంలో డెవలప్ అయ్యిందన్నారు. మున్సిపల్ కార్పొరేషనుగా మారిందని గుర్తుచేశారు.
డెవలప్మెంటులో భాగంగా బోడుప్పల్ లోని చాలా వ్యవసాయ భూములు లేఅవుట్లుగా మారాయని వివరించారు. వివిధ ప్రాంతాలవారు తమ సొంతింటి కలను నిజం చేసుకునేందుకు బోడుప్పల్ ను గుర్తించారని చెప్పారు. అదే విధంగా భావితరాలకు పెట్టుబడి కేంద్రంగా భావించారన్నారు. అందుకోసం పూర్తిగా నియమనిబంధనల ప్రకారం ఆస్తులను కొనుగోలు చేశారని స్పష్టం చేశారు.
కొనుగోలుదారులకు ప్రైవేట్ బ్యాంకులతో సహా ఎస్బీఐ, ఎల్ఐసీ హౌజింగ్ వంటి సంస్థలు రుణాలు మంజూరు చేసిన విషయాన్ని తెలియజేశారు. లింకు డాక్యుమెంట్లు, రెవెన్యూ రికార్డులు, ప్రైవేటు వ్యక్తుల పేరిట క్లియర్ టైటిల్, ఇంకబరెన్స్ సర్టిఫికెట్, నిషేధిత జాబితాలో లేకపోవడం వంటి అంశాల ధ్రువీకరణ తరువాతే క్రయవిక్రయాలు జరిగాయని వెల్లడించారు.
ఇటువంటి స్థితిలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్లు 45, 46, 47, 48, 49, 50, 06, 61, 62, 66, 67, 68, 69, 91, 92, 93, 94, 102, 103, 104, 105, 106, 111, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 128, 129, 130లలోని స్థలాలను వక్ఫ్ భూమిగా లిటిగేషన్ వేయడం ఏమిటని ప్రశ్నించారు. చట్టపరమైన అన్ని ఆధారాలను అధికారులకు సమర్పించామని తెలిపారు. సమస్యను పరిష్కరించి 7వేల కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలని అధికారులకు విన్నవించుకున్నట్లు చెప్పారు.