బోడుప్పల్ వక్ఫ్ బాధితుల పక్షాన పోరాడుతాం : ఎమ్మెల్యే రఘునందన్ రావు

 

మేడ్చల్, వార్తానిధి: మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న వక్ఫ్ బాధితుల పక్షాన పోరాడుతామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పష్టం చేశారు. బోడుప్పల్ లోని వివిఎస్ బొమ్మక్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన వక్ఫ్ బోర్డు బాధితుల జేఏసీ కుటుంబాల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. 

ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ కష్టార్జితంలో దశాబ్దాల క్రితం స్థిర నివాసం ఏర్పరచుకున్న కాలనీవాసుల భూములను వక్ఫ్ బోర్డు పేరిట నిషేధిత జాబితాలో పెట్టడం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయం సుమారు 7వేల కుటుంబాలకు జీన్మరణ సమస్యగా మారిందన్నారు. బిఆర్ఎస్ మిత్రపక్ష నాయకుడైన అక్బరుద్దీన్ ఒవైసీకి ఇచ్చిన హమీ మేరకే భూములను వక్ఫ్ బోర్డు స్థలాలు ప్రకటించారా అని అసెంబ్లీలో తాను ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశారు. తాను ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ వకీల్ సాబ్ అంటూ అవహేళన చేశారన్నారు. 

శోభకృత్ నామ సంవత్సరం ఎన్నికల నామ సంవత్సరంగా బిఆర్ఎస్ భావిస్తోందని అభిప్రాయపడ్డారు. అందుకే నష్టపోయిన రైతుల వద్దకు సీఎం కెసిఆర్ వెళ్లారని, ఎల్బీనగర్ చౌరస్తాకు తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి పేరు పెట్టడం చేస్తున్నారని అన్నారు. బోడుప్పల్ భూముల విషయంలో కోర్టులు, స్థానిక తహశీల్దార్ బాధితులకు అనుకూలంగా రిపోర్టులిచ్చినా కలెక్టర్ సమస్యను పరిష్కరించడంలో ఎందుకు తాత్సారం వహిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. త్వరలోనే కలెక్టర్ సమయం కోరుతానని, బాధితులంతా కలిసి వెళ్లి కలెక్టరుతో మాట్లాడుదామని చెప్పారు. ఏప్రిల్ 30 తేదీ లోపు వక్ఫ్ బోర్డు బాధితుల సమస్యను పరిష్కరించకపోతే ప్రశ్నించే గొంతుకగా సమస్య పరిష్కారం అయ్యే వరకు అన్ని వేదికలపైన పోరాటం చేస్తానని రఘునందన్ రావు బాధిత కుటుంబాలకు భరోసానిచ్చారు. తనకు వక్ఫ్ బోర్డు బాధితుల సమస్యను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తున్న బిజెపి మేడ్చల్ నియోజకవర్గ నాయకులు కొంపల్ మోహన్ రెడ్డికి ధన్వయాదాలు తెలిపారు.

Post a Comment

Previous Post Next Post