పీర్జాదిగూడ, వార్తానిధి: ప్రజల పక్షాన నిలుస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న బిజెపి నాయకులపై పోలీసులు దాడులు చేయడం హేయమైన చర్య అని బిజెపి రాష్ట్ర నాయకులు కొంపల్లి మోహన్ రెడ్డి ఆరోపించారు. పీర్జాదిగూడలోని శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై బిజెవైఎం మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు బండారి పవన్ రెడ్డి నిరసన తెలిపారు. న్యాయ విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పవన్ రెడ్డి పై పోలీసులు దాడి చేశారు. విషయం తెలుసుకున్న కొంపల్లి మోహన్ రెడ్డి మేడిపల్లి పోలీసు స్టేషనుకు చేరుకున్నారు. ఏసీపీ నరేశ్ తో మాట్లాడారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ మానవ హక్కులను హరిస్తున్నారని విమర్శించారు. బిజెపి నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడమంటే అధికార పక్షానికి కొమ్ము కాయడమేనని ఆగ్రహం ప్రకటించారు. పవన్ రెడ్డిపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, లేదంటే పార్టీ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం అపెక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్ రెడ్డిని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.#BJPTelangana #Medchal #KompallyMohanReddy #Peerzadiguda #BJYM