చదువు... ఆనందించు... అభివృద్ధి చెందు : బొడ్డు రవి

 


100 రోజుల పఠన మహోత్సవ కార్యక్రమాన్ని మండల పరిషత్ కేంద్ర ప్రాథమిక పాఠశాల ఇంజాపూర్ లో ఉపాధ్యాయ బృందం ప్రారంభించారు. అందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు రవి వెల్లడించారు. చదువు.. ఆనందించు.. అభివృద్ధి చెందు అనే నినాదంతో కార్యక్రమం సాగుతోందన్నారు. మరిన్ని వివరాలను తెలియజేశారు.

రీడ్ పేరిట వినూత్న కార్యక్రమం..

1 నుండి 9 వ తరగతి చదివే పాఠ‌శాల విద్యార్థుల కోసం కేంద్ర ప్ర‌భుత్వం రీడ్ అనే వినూత్న కార్యక్ర‌మాన్ని చేప‌ట్టింది. పాఠ‌శాల‌లో విద్యార్థుల‌కు చ‌ద‌వడం అలవాటుగా ఉండాల‌ని  రీడ్ ( రీడ్-ఎంజాయ్- డెవలప్) కార్య‌క్ర‌మానికి పూనుకుంది. తెలుగులో దీని అర్థం చదువు.. ఆనందించు.. అభివృద్ధి చెందు.

దేశ వ్యాప్తంగా అన్ని పాఠ‌శాల‌లో ఈ రీడ్ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో ఈ నెల 5 నుంచి రీడ్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ రీడ్ కార్య‌క్ర‌మం ద్వారా పిల్ల‌లు చ‌దువుకోవ‌డానికి ప్ర‌త్యేకంగా ఒక పీరియ‌డ్ ను కేటాయిస్తారు. ఈ పీరియ‌డ్ లో విద్యార్థులు అంద‌రూ కూడా చ‌ద‌వుకోవ‌డానికి మాత్ర‌మే స‌మ‌యం కేటాయించేలా ఉపాధ్యాయులు చూడాలి.

ఒక‌టో త‌ర‌గతి నుంచి తొమ్మిదో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఈ రీడ్ అనే కార్య‌క్ర‌మాన్ని వ‌ర్తింప చేస్తారు. ఈ కార్య‌క్ర‌మం 100 రోజుల పాటు ఉండ‌నుంది. పాఠ్యా పుస్తకాలే కాకుండా క‌థలు, న్యూస్ పేప‌ర్స్ తో పాటు ఇత‌ర పుస్తకాల‌ను కూడా విద్యార్థులకు ఇస్తారు. అలాగే రీడ్ కార్యక్ర‌మం పై ఉపాధ్యాయుల‌కు అవ‌గాహ‌న కూడా క‌ల్పిస్తారు.


రీడ్ మార్గదర్శకాలు…

1.గ్రంథాలయ పుస్తకాలు చదివేందుకు ప్రతిరోజూ ఒక పీరియడ్‌ కేటాయించాలి. 

2.మూడు రోజులు మాతృభాషలో, రెండు రోజులు ఆంగ్లభాషలో, ఒకరోజు ద్వితీయ భాషలోని కథల పుస్తకాలను చదివించాలి.

3.ప్రాథమిక పాఠశాలల్లో ఐదుగురు విద్యార్థులతో, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6 నుంచి తొమ్మితో తరగతి వరకు ఒక్కో తరగతికి ఒక గ్రంథాలయ కమిటీని ఏర్పాటు చేయాలి. వారికి ఆసక్తి కలిగిన పుస్తకాలు చదివేలా విద్యార్థులను ప్రోత్సహించాలి.

4. తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ఇంటి దగ్గర సైతం ఆ పుస్తకాలు చదివించేలా కృషి చేయాలి.

5.ప్రతి శనివారం పఠన పోటీలు నిర్వహించాలి. కథలు చెప్పించడం, చదివిన దాని గురించి మాట్లాడించడం వంటి పోటీలతో విద్యార్థుల్లో పఠన సామర్థ్యాన్ని పెంచాలి.

6.నెలకు ఒకసారి విద్యార్థుల తల్లిదండ్రులు, ఎస్‌ఎంసీ సభ్యులను పాఠశాలలకు ఆహ్వానించాలి. వారి నేతృత్వంలో విజేతలకు బహుమతులు అందజేయాలి.

7.రూమ్‌ టు రీడ్‌, సేవ్‌ ద చిల్డ్రన్‌, యూనిసెఫ్‌, బ్రెడ్‌ వంటి స్వచ్ఛంద సంస్థల సేవలను సద్వినియోగం చేసుకోవాలి.

8.అన్ని పాఠశాలల్లో ఫిబ్రవరి 14 నుంచి 21వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించాలి.

8. 21న అన్ని పాఠశాలల్లో మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహించాలి.

9.మండలస్థాయిలో ఎంఈవో ఐదుగురు విషయ నిపుణులతో కోర్‌ టీంను ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ వారానికి ఒక సారి పఠనాభివృద్ధి నివేదికను డీఈవోకు సమర్పించాలి.

ఉపాధ్యాయులపై గురుతర బాధ్యత...

రీడ్‌ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ఉపాధ్యాయులపై గురుతర బాధ్యత  ఉందని బొడ్డు రవి తెలిపారు. ఎంఈవోలు, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పాఠశాలలను మానిటరింగ్‌ చేస్తూ విజయవంతం చేయాలి. అప్పుడే ఈ కార్యక్రమం ఆశించిన లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు.

Post a Comment

Previous Post Next Post