రంగారెడ్డి జిల్లా, వార్తానిధి: 317 జీఓను సవరించి స్థానిక ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని తపస్ ఆధ్వర్యంలో తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎస్.జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బొడ్డు రవి పిలుపునిచ్చారు.
రేపు ఉదయం ఇందిరా పార్కు వద్ద మహాధర్నా ప్రారంభమవుతుందని వారు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నెంబరు 317 గత కొన్ని రోజులుగా ఉద్యోగ, ఉపాధ్యాయులందరినీ ఎంతగానో మానసిక వేదనకు గురి చేస్తోందన్నారు.
ఎందరో ఉపాధ్యాయులు తమ ప్రాణాలను కోల్పోయారని తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సంఘాలు నెత్తీ నోరూ మొత్తుకుని మొరపెట్టుకున్నా, ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని ారోపించారు.
అత్యంత గోప్యంగా 317 జీఓను అమలు చేయడానికి పూనుకుందని విమర్శించారు. 317 కు చేయవల్సిన సవరణలు చేయకుండా సీనియారిటీ ఆధారంగా జిల్లాల కేటాయింపు జరిపారన్నారు.
అలాగే మహిళలకు, వితంతువులకు, దివ్యాంగులకు, స్పౌజ్ అవకాశాన్ని వినియోగించుకోనేందుకు, అన్ని జిల్లాలకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. నిర్బంధం విధిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు అన్యాయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ 317 జీఓకు సవరణలు చేయాలని, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేస్తోందన్నారు. తెలంగాణ ఉద్యమం స్దానికత ఆధారంగా చేసిన ఉపాధ్యాయులు నేడు స్దానికతను కోల్పోయారని చెప్పారు.
ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇతర జిల్లాలలో స్దానికేతరులుగా ఉండవలసి వస్తోందని వివరించారు. తాము కూడా తెలంగాణ రాష్ట్రంలో స్దానికత కోసం పోరాటం చేయవలసి వస్తుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ఇందిరా పార్కు వద్ద తలపెట్టిన మహాధర్నాలో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.