టిపియుఎస్ మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ..

 

పోస్టర్ ఆవిష్కరిస్తున్న టిపియుఎస్ నాయకులు..

రంగారెడ్డి జిల్లా, వార్తానిధి: 317 జీఓను సవరించి స్థానిక ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న మహాధర్నాను తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(టిపియుఎస్) తలపెట్టింది.

ధర్నాకు సంబంధించిన గోడ పత్రికను టిపియుఎస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు రవి ఆవిష్కరించారు. ఆయనతో పాటు జిల్లా ఉపాధ్యక్షుడు జిహెచ్ఎం చెరక రాందాస్, మంచాల మండల అధ్యక్షుడు ఉదారి నర్సింహా, ప్రధాన కార్యదర్శి పూజరి రమేశ్, టిపియుఎస్ బాధ్యుడు భూత రాజు రమేశ్ తదితరులున్నారు.

ఈ సందర్భంగా బొడ్డు రవి మాట్లాడుతూ ఈ నెల 12న తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ఇందిరా పార్కు వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నా జరుగుతుందని చెప్పారు.

ప్రభుత్వం బేషరత్తుగా 317 జీఓను సవరించాలని డిమాండ్ చేశారు. సీనియారిటీ ప్రకారమే కాకుండా, స్థానికతను పరిగణలోకి తీసుకొని నూతన జిల్లాల కేటాయింపులు జరపాలన్నారు.

ఒంటరి మహిళలు, వితంతువులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. 40 శాతం వైకల్యం కలిగిన వారికి కూడా అవకాశం కల్పించాలన్నారు. స్పౌజ్ కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి, ప్రతి జిల్లాలో అవకాశమివ్వాలని అన్నారు.

గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మల్టీజోన్2లో ఉండి మొదటి ఆప్షన్ మల్టీ జోన్-2కు ఇచ్చినప్పటికీ మల్టీజోన్-1కు అలాట్ చేయడం అన్యాయమని ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. వారిని మల్టీజోన్-2లో కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని తెలిపారు.

సీనియారిటీ జాబితాలో తప్పులను సవరించాలని, పరస్పర బదిలీలకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యేను కలిసిన టిపియుఎస్ నాయకులు..

స్థానిక ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరుతూ టిపియుఎస్ ఇబ్రహీంపట్నం డివిజన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి పత్రాన్ని టిపియుఎస్ నాయకులు అందజేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలిపి సమస్యను పరిష్కరించేలా చూడాలని ఎమ్మెల్యేను కోరారు.


Post a Comment

Previous Post Next Post