నర్సాపూర్, వార్తానిధి: ప్రజల సమస్యలను తీర్చాల్సిన ప్రగతి భవన్ ప్రజలకు కొత్త సమస్యలను కలిగిస్తోందని ఎన్ఎస్ యుఐ మెదక్ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు హరీశ్ వర్ధన్ అన్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 17న ప్రారంభించనున్న తెలంగాణ నూతన సచివాలయానికి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. కానీ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలన నడుస్తుందో లేదో బిఆర్ఎస్ ప్రభుత్వం పరిశీలించుకోవాలన్నారు. సీఎం జన్మదిన సందర్భంగా నూతన సచివాలయాన్ని ప్రారంభించాలనుకోవడం రాచరికాన్ని తలపిస్తోందని ఎద్దేవా చేశారు. తెలంగాణ స్వరాష్ట్ర సాకారం సోనియా గాంధీ వల్లే జరిగిందని వివరించారు. తమ పార్టీ హయాంలోనే ప్రజలందరూ సంక్షేమ పాలనను చూశారని ధీమాగా చెప్పారు. ఇందిరమ్మ ఇల్లు, ఆరోగ్య శ్రీ వంటి పథకాలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు. నేడు రాష్ట్రంలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలందరికీ తమ పార్టీ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ప్రకటించారు.
#HarishVardhan #NSUI #Congress #Telangana