రంగారెడ్డి, వార్తానిధి: ప్రభుత్వ పాఠశాలల్లో గణనీయంగా ప్రవేశాలున్నా కూడా సమస్యలు మాత్రం నెలకొనే ఉన్నాయని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం(టిపియుఎస్) రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు రవి అన్నారు.
ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను బుధవారం విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమం విజయవంతంగా సాగుతుందన్నారు. విద్యార్థులు అధిక సంఖ్యలో ప్రైవేటు బడుల నుంచి వచ్చి ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు పొందారని తెలిపారు. జూన్ 30వ తేదీన బడి బాట కార్యక్రమం ముగియనుందని, అప్పటి వరకు మరిన్ని ప్రవేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ విద్యా శాఖ జూన్ 13 నుచి 30వ తేదీ వరకు బ్రిడ్జి కోర్సును టి-శాట్ చానల్ ద్వారా ప్రసారం చేస్తోందని తెలిపారు. ఆ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, తమ సామర్థ్యాలను పెంచుకోవాలని కోరారు.
మన ఊరు-మన బడి పథకం ద్వారా రంగారెడ్డి జిల్లాలోని 464 పాఠశాల్లో అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తద్వారా బడుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంటుందని వివరించారు.
జూలై 1 నుంచి ప్రారంభమయ్యే సిలబస్ పాఠశాలకు కావాల్సిన పాఠ్య పుస్తకాలు ప్రభుత్వ బడులకు ఇంకా చేరలేదని స్పష్టం చేశారు. వెంటనే పాఠ్య పుస్తకాలను అందజేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ విద్యా సంవత్సరం నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థుల నమోదు పెరిగిందని తెలియజేశారు. అంతా బాగానే ఉన్న రోజువారి కార్యకలాపాలకు కావాల్సిన స్టేషనరీ కొరత ఉందని చెప్పారు.
సమగ్ర శిక్షా అభియాన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెలలో వెనక్కు తీసుకోవడం వల్ల పాఠశాల నిర్వహణలో సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం సుద్దముక్కలు, బోధన సామాగ్రి దిక్కులేని అన్నారు.
మూత్ర శాలల నిర్వహణకు కూడా నిధులు లేవని, కనీసం స్కావెంజర్‌ను నియమించుకునే పరిస్థితి కనబడటం లేదన్నారు. నిధుల మంజూరుతో పాటు సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు.
విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ అందించాలని సూచించారు. ఉపాధ్యాయుల నియామక, ప్రమోషన్స్, బదిలీలు వెంటనే చేపట్టాలని కోరారు.