హైదరాబాద్, వార్తానిధి: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దిల్‌సుఖ్‌నగర్ భాగ్ హస్తినాపురం శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనాన్ని టీచర్స్ కాలనీ కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు.
కార్యక్రమానికి భాగ్యనగర్ విభాగ్ కార్యావహ వట్టిపల్లి శ్రీకాంత్ వక్తగా విచ్చేసి మాట్లాడారు. ఛత్రపతి శివాజీకి ఆయన తల్లి జిజియా మాత తొలి గురువుగా బాల్యం నుంచే దేశభక్తిని నూరిపోశారని చెప్పారు.
గురువైన సమర్థ రామదాసు వద్ద యుద్ధ విద్యలు, లౌక్యం నేర్చుకున్నారని అన్నారు. శివాజీ గొప్ప చక్రవర్తి అని పరిపాలనాదక్షుడని కొనియాడారు. గెరిల్లా యుద్ధాల ద్వారా శత్రువులను జయించారని వివరించారు.
ఎలాంటి అసమానతలకు తావు లేకుండా సుస్థిర పాలనను ప్రజలకు అందించారని, హైందవి స్వరాజ్యం సాకారం చేశారని గుర్తు చేశారు. గ్రామ స్వరాజ్యానికి ఆద్యుడు శివాజీ మహరాజ్ అని అన్నారు.
హైందవ సమాజ సంఘటితం కోసం ఛత్రపతి శివాజీనే మార్గదర్శకులని స్పష్టం చేశారు. హైందవి స్వరాజ్యం కోసం ఆయన చేసిన త్యాగాలే స్ఫూర్తి అని తెలిపారు.
శివాజీ స్ఫూర్తితో నేటి సమాజాన్ని జాగృతం చేయాలని సమ్మేళనానికి విచ్చేసిన ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో 91మంది ఉపాధ్యాయులతో పాటు ముఖ్య ఆహ్వానితులైన చైతన్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, సంఘ్ పెద్దలు దిల్‌సుఖ్‌నగర్ భాగ్ సహ సంపర్క ప్రముఖ్ చంద్రమోహన్, హస్తినాపురం నగర కార్యావహ ప్రేమ్‌రాజ్, నగర వ్యవస్థ ప్రముఖ్ రాజేశ్వర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, బొడ్డు రవి తదితర సంఘ్ కార్యకర్తలు పాల్గొన్నారు.