అక్కన్నపేట, వార్తానిధి: పేద.. మధ్య తరగతి ప్రజలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరల మోత మోగిస్తున్నాయని అక్కన్నపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జంగపల్లి ఐలయ్య అన్నారు.
మండల కేంద్రంలో ఆయన శుక్రవారం మాట్లాడుతూ పెంచిన పెట్రోల్, డీజిల్,వంటగ్యాస్ ధరల వల్ల సామాన్య ప్రజలు బతకడమే భారమైందని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం బస్సు చార్జీలు, విద్యుత్ చార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలపై భారం మోపుతోందని తెలిపారు.
యూపీఏ ప్రభుత్వం 2011 జూన్ 24న వంటగ్యాస్ సిలిండర్ ధర 11.42 పైసలు పెంచి మొత్తం సిలిండర్ 450 రూపాయలు చేసిందన్నారు. అప్పుడు ప్రస్తుత కేంద్రమంత్రి స్మృతి ఇరాని గ్యాస్ సిలిండర్ పెరుగుదలపై నాటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ని హేళన చేస్తూ గాజులు పంపారని గుర్తు చేశారు.
డిసెంబరు నుంచి ఇప్పటి వరకు 150 రూపాయలు పెంచి 1050 చేసినందుకు ప్రధాని మోడీకి గాజులతో పాటు చీరలు, పువ్వులు కూడా పంపిన తక్కువేనని మండిపడ్డారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ధరల నియంత్రణలో విఫలమైందని విమర్శించారు. ఇదే విధంగా కొనసాగితే సామాన్య ప్రజల ఆగ్రహానికి గురికా తప్పదని హెచ్చరించారు.