గడీల పాలనకు ఇది కాలం కాదు : హరిప్రసాద్

 

హైదరాబాద్, వార్తానిధి: సీఎం కెసిఆర్ అహంకారానికి.. ఈటల రాజేందర్ ఆత్మగౌరవానికి మధ్య హుజురాబాద్ ఉప ఎన్నిక జరిగిందని బిజెపి మేడ్చల్-మల్కాజ్ గిరి అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి జి.హరిప్రసాద్ అన్నారు.

ఉప ఎన్నికల ఫలితాల్లో బిజెపి ఈటల రాజేందర్ భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఆయన కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని ఫతేనగర్లో సంబరాలను నిర్వహించారు. భారీ ఎత్తున ర్యాలీని జరిపారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడారు.

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ ఆత్మగౌరవం గెలిచిందన్నారు. బలమైన పార్టీ బిజెపిలో బలమైన నాయకుడు రాజేందర్ చేరడం వల్లనే విజయం దక్కిందన్నారు.

గడీలలో దొర కింద బానిసలా ఉండలేక రాజేందర్ తిరుగుబాటు చేశారని అభిప్రాయపడ్డారు. వెంటనే ఆయనను అణచివేసేందుకు తప్పుడు కేసులు నమోదు చేశారని గుర్తు చేశారు.

గడీల అహంకారానికి వ్యతిరేకంగా తన పదవికి రాజీనామా చేసి.. మరోమారు ఎమ్మెల్యేగా పోటీ దిగారని వివరించారు. అహంకారానికి, ఆత్మగౌరవానికి జరిగిన పోటీలో ఆత్మగౌరవమే విజయం సాధించిందని స్పష్టం చేశారు.

గొర్రెలు.. బర్రెలు ఇస్తం.. మేం చెప్పిన పంటనే పండించాలి.. నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వం.. రాష్ట్రాన్ని అప్పులలో ముంచుతాం.. మమ్మల్ని అడిగిన వారిని అణచివేస్తామనే ధొరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని హరిప్రసాద్ ఆరోపించారు.

గడీల పాలనకు ఇది కాలం కాదని.. ప్రజాస్వామ్యంలో ప్రజలే కేంద్రంగా పాలన జరగాలన్నారు. నిలబెట్టుకోలేని వాగ్ధానాలను.. నెరవేర్చలేని హమీలను ఇవ్వొద్దని ప్రభుత్వాన్ని కోరారు.

ప్రజల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని హితవు పలికారు. ప్రజా సంక్షేమాన్ని ప్రచారంలో కాకుండా.. వాస్తవ రూపంలో చూపించాలన్నారు. తెలంగాణ ప్రజల పక్షాన బిజెపి ఎల్లప్పుడు నిలుస్తుందని స్పష్టం చేశారు.

యువత, విద్యార్థులు, నిరుద్యోగులకు బిజెవైఎం అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి, బిజెవైెఎం శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


#BJYM #BJP #EETELARAJENDAR #HUZURABADBYPOLL

Post a Comment

Previous Post Next Post