నరకాసురున్ని సత్యభామ సహితుడై శ్రీక్రుష్ణుడు వధించిన రోజే నరక చతుర్ధశి. పురాణేతి హాసాల్లో చెప్పిన కథలు కట్టుకథలు అనుకోవడానికి వీలు లేదు.
దానిని మన నిత్య జీవితానికి అనువదించుకున్నప్పుడే అందులోని అంతరార్థం తెలుస్తుంది. ఆ కథల్లోనే మనల్ని మనం సవరించుకునే ఎన్నో అంశాలు దాగి ఉంటాయి.
నరకాసురుడు పదహారు వేల మంది స్త్రీలను బంధించినట్టు కథలో ఉంది. ఆ పదహారు వేల మంది కూడా శ్రీక్రుష్ణుడినే భర్తగా భావించారట.
ఆ పదహారు సంఖ్యను మనకు ఆపాదించుకన్నట్లయితే మన శరీరం తయారు కావాలంటే పదహారు అంశలు అవసరం అవుతాయి.
అవి పంచేద్రియాలు, పంచభూతములు, జ్ఞానేంద్రియాలు ఐదు, వీటన్నింటినీ ఆధీనంలో ఉంచేది మనసు. ఇవన్నీ మొత్తం కలిపి పదహారు.
ఈ పదహారు అంశలను భగవంతుడి కోసం అతని సాన్నిధ్యంకోసం వినియోగించాలన్నదే ఈ పదహారు సంఖ్య సూచిస్తుంది,.
మరొక విషయం ఏంటంటే నరకాసురుడు ఉన్న పట్టణం పేరు ప్రాగ్‌జ్యోతిష్య పురం. ఇందులో జ్యోతిష అంటే కాంతి వంతమైన, ప్రాగ్ అంటే కోల్పోయిన అంటే ఒకప్పడు ఉన్న కాంతిని కోల్పోయిన నగరం అనే అర్థం వస్తుంది.
మన శరీరం కూడా అలాంటిదే. ఎన్నో రకాల చెడు ఆలోచనలు, కోపం, ద్వేషం లాంటి పిచ్చి ఆలోచనలతో మన శరీరాన్ని కాంతిని కోల్పోయిన దేహంగా తయారు చేసుకుంటున్నాం.
చెడిన మనసు ఉంటే జీవితం నరక ప్రాయంగా ఉంటుంది. అందుకే అతన్ని నరకాసురుడు అంటున్నాం. నరకాసురుడిని సంహరించి, మన శరీరాన్నితిరిగి కాంతి వంతంగా తయారు చేయాలంటే ఆ పదహారు అంశలు అవసరం.
వాటన్నింటినీ భగవంతుడి మయం చేస్తే మన శరీరం తిరిగి కాంతి వంతమవుతుంది.