జహీరాబాద్ పట్టణంలోని పురాతన దేవాలయాల్లో శ్రీ కైలాసనాథ దేవాలయం ఒకటి. వందల సంవత్సరాల వరకు ఇక్కడి శివుడికి ఓ గుహలో పూజలు జరిగేవి. 1984 సంవత్సరంలో శివ భక్తుడైన అల్లాడి రచ్చయ్య గుప్తా పరమేశ్వరుడికి ఆలయ ప్రాంగణాన్ని నిర్మించారు. ఆలయ ఆవరణలో సకల విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు శుభప్రదాయకులైన వెలిసి ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా కొలువుదీరారు. ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకులుగా దర్శనమిస్తారు. నందీశ్వరుడు పరమేశ్వరుడిని కాచుకొని ఉంటాడు. భక్తుల వినతులను వింటూ ఆ భోళా శంకరుడికి చేరవేస్తాడు. ఆలయ పరిసరాలకు చేరగానే మనసు ప్రశాంతంగా ఉంటుందని.. ఆధ్యాత్మిక చింతన కలుగుతుందని ఇక్కడకు వచ్చే భక్తులు చెబుతుంటారు. అభిషేక ప్రియుడైన కైలాసనాథ స్వామి వారు జహీరాబాద్ పట్టణంలో రామ్‌నగర్‌లోని మందిరంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. |