పేరు ప్రదర్శించకపోతే హిందువుల మనోభావాలు గాయపరిచినట్లే..!


“గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు” కొంతమంది వ్యవహరించడం  దొంగతనాన్ని ఒప్పుకున్నట్లే భావించాలి. తమ వ్యాపారం కోసం ఇతరుల పవిత్రతకు, దీక్షకు భంగం కలిగిస్తామంటే నాగరిక సమాజం ఒప్పుకోదు. హిందువులు అత్యంత పవిత్రంగా నిర్వహించే  కావడి (కన్వర్) యాత్రపై జరుగుతున్న వివాదం రాజకీయ దుమారాన్ని దాటి, ఏకంగా సుప్రీంకోర్టు తలుపు తట్టింది. భక్తుల విశ్వాసాలు, సంప్రదాయాలతో పనిలేదన్నట్లు, కేవలం రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని తీర్పు చెబితే చాలు అనే ధోరణిలో సుప్రీం కోర్టు కూడా వ్యవహరించడం సమ్మతం కాదు.

 ఓ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ.. “నేను కేరళలో ఓ ముస్లిం నిర్వహించే రెస్టారెంట్ కు వెళ్లాను.  అక్కడి భోజనం నాకు నచ్చింది” అని తీర్పు చెప్పారు. అయితే.. "ఇక్కడ ముస్లిం రెస్టారెంట్ లో సాధారణ ప్రజలు భోజనాలు చేయడం వేరు.. అత్యంత పరమ పవిత్రంగా  దీక్షలో పాల్గొని పూజలు చేస్తూ, ప్రసాదాలు స్వీకరించడం వేరు" అనే విషయం సుప్రీంకోర్టు గ్రహించకపోవడం గమనార్హం.

 నియమనిష్టలు, ఆచార వ్యవహారాలు , పద్ధతుల ఆధారంగా భోజనాలు చేయడం, ప్రసాదం స్వీకరించడం అనేది కావడి భక్తుల ఆచారం. రుచికరమైన భోజనాలు చేయాలి, కడుపు నింపుకొని బ్రేవ్ అని డే పుకుంటూ బయటకు రావాలి అనేది కాదు  అసలు సారాంశం.! కాబట్టి,అసలు విషయం  వదిలి ఏవేవో మాట్లాడటం సమంజసం కాదు. 

నీ పేరు చెప్పేందుకు నీకున్న అభ్యంతరం ఏంటనీ ప్రశ్నిస్తే.. మైనార్టీలపై దాడులకు దిగుతున్నారని అసంబద్ధ వాదనకు దిగుతూ.. ఎదురుదాడి చేయడం దుర్మార్గం. దీనికి మద్దతుగా సంబంధం లేని కొంతమంది రాజకీయ నాయకులు వంత పాడటం.. సుప్రీంకోర్టు జడ్జి కూడా వెనకేసుకొరావడం ఏమాత్రం బాగోలేదు. హిందువులకు శ్రావణమాసం పరమ పవిత్రమైనది. ఎటువంటి నీసు (మాంసాహారం )ముట్టుకోకుండా నిష్టతో పూజలు చేయడం,ఉపవాస దీక్షతో భగవంతుడిని కొలవడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇది ప్రపంచంలోని హిందువులందరూ ఒక్కో తీరుగా శ్రావణమాసంలో పూజలు నిర్వహించడం ,భగవంతుడిని కొలవడం అనాదిగా వస్తున్న పరంపర. అయితే నేడు ఆచార వ్యవహారాలపైనే దాడులు చేసేందుకు రాజకీయ నాయకులు, కోర్టులు మానవ హక్కుల రూపంలో ఉన్న హిందూ వ్యతిరేకులు అంతా కట్టకట్టుకుని హిందూ ధర్మంపై దౌర్జన్యం చేస్తున్నారు. ఏడాదికోసారి ప్రతి శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి, నిష్టతో శివుడిని కొలిచేందుకు కావడి యాత్ర తీస్తుంటే..భక్తులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారి దీక్షకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారు. పవిత్రమైన భోజనం, పరిశుద్ధ ఆహారం పూజలో భాగమని.. మాంసాహార ప్రియులు వండే ఆహారంతో పూజ ఫలం చెడుతుందని భక్తులు మొత్తుకుంటుంటే ఏమాత్రం పట్టించుకోకపోవడం హిందువుల మనోభావాలను గొడ్డలి పెట్టు. పైగా వారి నిర్ణయాలను ఎత్తి పొడుస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం హిందువుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడమే అవుతుంది.

హోటల్ పేరు ఏదైనా వంట చేసేవాడు, వడ్డించేవాడు ఎవడైనా సరే వారు పెట్టింది తినాలి అంటూ.. ఓ వైపు కోర్టులు గద్దిస్తుంటే , మరోవైపు రాజకీయ నాయకులు కావడి యాత్ర భక్తులపై గాండ్రింపులకు దిగుతున్నారు. ఇది చాలదు అన్నట్లు.. సోనుసూద్ అనే నటుడి మాటలు మరీ వెటకారంగా ఉన్నాయి. "శబరి ఎంగిలి రాముడు తినలేదా..? ముస్లింల ఎంగిలి మీరు తింటే తప్పేంటీ..?" అని పుండుపై కారం చల్లుతున్నాడు. పరోక్షంగా ముస్లింల ఎంగిలి తినాలి అని హెచ్చరిస్తున్నాడు.

 సుప్రీంకోర్టు జడ్జితోపాటు ప్రకాష్ రాజ్, సోనుసూద్ వంటి నటులు, ఇతర రాజకీయ నేతలు హోటల్ ప్రచారకర్తలుగా వ్యవహరించడం హిందువుల పూజలను అవమానిస్తున్నారు.

 హిందువులు ఏం తినాలి.. ఎలా పూజించాలి.. ఎవరితో వస్తువులు కొనాలి.. పూజా పద్ధతులను  కూడా రాజకీయ నాయకులు, కోర్టులు నిర్ణయించడం అసంబద్ధం. హిందువుల హక్కులు, స్వేచ్ఛను హరించే  ఈ తీర్పు ఏమాత్రం సమ్మతం కాదు.

"అసలు విషయం ఇక్కడ హిందూ ముస్లిం కాదు. మా పవిత్రత. శాఖాహారంతో కూడిన శుభ్రమైన భోజనం కావాలి. భోజనం అనే కన్నా ప్రసాదం అంటే ఇంకా బాగుంటుంది. దీక్షలో ఉన్నప్పుడు నిష్ఠతో తయారుచేసిన మత్యల్పహారాన్ని ప్రసాదంగా భుజించడం హిందువుల సంప్రదాయం" అని కావడి యాత్రికుల వాదన. కానీ అవన్నీ ఏమీ లేవు, మీరు ఇక్కడే భోజనం చేయండి.. అదంతా బాగుంది అంటూ హిందువులను భయభ్రాంతులకు గురి చేయడం ఆశ్చర్యకరం.

ఇలాంటి బుజ్జగింపు రాజకీయాల వల్ల తీవ్ర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు. అందుకు చక్కటి ఉదాహరణగా..

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిన భక్తులపై ముస్లిం వ్యాపారులు తీవ్రంగా దాడి చేశారు. వారి వాహనాలను ధ్వంసం చేశారు. భక్తులను పరిగెత్తించి, వెంబడించి చితక బాదారు. ఎందుకంటే "మా దగ్గరే వస్తువులు కొనాలి. మేము చెప్పిన ధరే చెల్లించాలి. బేరమాడితే కుదరదు."అంటూ  ఏడాది క్రితం ఉగాది సమయంలో శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఘర్షణ చోటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అసలు ఘర్షణ ఎందుకంటే..హిందువులు కానివారు శ్రీశైలంలో వ్యాపారం చేస్తున్నారు. రూ 20 వాటర్ బాటిల్ ను 25 రూపాయలకు అమ్ముతున్నారు. అదేంటీ..? 20 రూపాయలే కదా..అని భక్తులు అడిగితే.. ఇది ఇంతే, అంటూ గద్దించారు. విసుగు  చెందిన భక్తుడు వేరే దుకాణానికి వెల్లాడు. దీంతో ముస్లిం వ్యాపారులు గొడవకు దిగారు. "కొంటె మా దగ్గరే కొనాలి. చెప్పినంతే చెల్లించాలి"  అంటూ హుకుం జారీ చేశారు. అయితే ధర నచ్చకో.. వస్తువు నచ్చకో భక్తులు కొనలేదు. ఈ కారణంగా ముస్లిం వ్యాపారులంతా కలిసి భక్తులపై తీవ్రంగా దాడి చేశారు. భయాందోళనలు సృష్టించి భక్తుల  వాహనాలను ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రజలు ఇంకా మరువనే లేదు.  పైగా దాడి ఘటన సమర్థించుకుంటూ.. దాడికి గురైన వారు కర్ణాటక భక్తులు అంటూ ప్రాంతాల వారిగా విభజన తీసుకువచ్చారు. కర్ణాటక అయినా ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఉత్తరప్రదేశ్ అయినా భక్తులు భక్తులే. వారిపై ముస్లింలు దాడి చేస్తే ఈరోజు సుప్రీంకోర్టును ఆశ్రయించిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా, విద్యావేత్త అపూర్వ ఆనంద్, కాలమిస్ట్ ఆకార్ పటేల్, పౌర హక్కుల రక్షణ సంఘాలు, సంస్థలు  ఆ రోజు ఎందుకు స్పందించలేదో ఈ సమాజానికి తెలియజేయాలని హిందూ సమాజం డిమాండ్ చేస్తోంది.

హిందువులు కలియుగ దైవంగా భావించి ఆరాధించే తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో అన్యతస్తుల ప్రచారం.. తిరుమల పవిత్రతను దెబ్బతీసే కుట్రలపై స్పందించేందుకు "పెద్దలకు" సమయం ఉండదు. ఏడుకొండలను మూడు కొండలుగా విభజన చేస్తాననే ప్రకటనపై నోరు మెదపరు. అసలు శ్రీశైలం తో పాటు అనేకమైన హిందూ పుణ్యక్షేత్రాలలో ముస్లింల దుకాణాలకు అనుమతులు ఎవరు ఇచ్చారో జవాబు దొరకదు.

రాముడే లేడు, రామాయణం మిథ్య  అనే దిగజారుడు మాటలపై పెదవి విప్పరు.  తెలంగాణ ఆత్మ పండుగ బతుకమ్మపై హైదరాబాద్ ఎంపీ వెటకారంగా మాట్లాడితే.. భాగ్యనగర్ నడిబొడ్డున వెలసిన భాగ్యలక్ష్మి మందిరంలో పూజలు నిషేధించి గంట కొట్టడంపై ఆంక్షలు విధిస్తే నోరు మేదిపేందుకు "పెద్దలకు" మనసు రాదు.

 ఇలా..పరిస్థితులు అన్నీ గమనిస్తుంటే ఉత్తర భారతంతోపాటు దేశ వ్యాప్తంగా శ్రీశైలం వంటి దుర్ఘటనలు జరిగేందుకు ఎంతో దూరంలో  లేదనిపిస్తోంది.

మరి వారి హక్కుల గురించి మాట్లాడే పెద్దలు "హలాల్" గురించి ఎందుకు మాట్లాడటం లేదో సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. "అసలు హలాల్ అనేది ప్రభుత్వం నిర్దేశించిన మార్కు కాదు. మరి ఎవరు నిర్ణయించారు.? ఎందుకు అలా విభేదించి వ్యాపారం చేయాలి..? సమాజాన్ని రెండు వర్గాలుగా  ఎందుకు ప్రోత్సహించాలి? ముఖ్యంగా హలాల్ ద్వారా వచ్చే సొమ్ము దేనికి ఉపయోగిస్తారు"..?అనే విషయంపై నేతలు ఎవరూ మాట్లాడారు. హలాల్  తో విభేదాలు సృష్టించి, వాటిని పెంచి పోషించే అంశం గురించి మాట్లాడడానికి కోర్టులు ఎందుకు ముందుకు రావడం లేదో ఎవరికి అర్థం కాదు. కానీ హిందువుల పండుగలపై, వారి ఆచార వ్యవహారాలపై, భోజనము, ప్రసాదము, ఇతర వేశ భాషలపై నిందలు వేయడానికి ఈ దేశంలో అన్ని పక్షాలు సిద్ధంగా ఉంటాయి.. అన్నివేళలా మేల్కొని ఉంటాయి.! కానీ హిందువుల మనోభావాల గురించి పట్టించుకునే వారు లేకపోవడం శోచనీయం.


కన్వర్ యాత్రలో భాగంగా శివనామ స్మరణ చేస్తూ.. సాత్విక ఆహారం భుజించి యాత్రలో పాల్గొనడం ఆనవాయితీ. ఏడాదంతా తమ కుటుంబానికి శుభాలు కలగాలని అత్యంత నిష్ఠతో కావడి మోస్తూ.. గంగాజలాన్ని తీసుకువచ్చి శివలింగాలకు అభిషేకం చేయడం సంప్రదాయం. కనీసం విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా కావడి భుజంపైనే ఉండాలి. శ్రీరాముడు, రావణాసురుడు, పరుశరాముడు వంటి దేవుళ్ళు కూడా కావడి యాత్ర నిర్వహించారు. ఈ మాసంలో పవిత్రమైన గంగాజలంతో అభిషేకం చేస్తే శివుడు ప్రసన్నమై, కోరికలు ఫలించి,  శుభాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం. కానీ వారి విశ్వాసాలకు భంగం కలిగించేలా కోర్టులో రాజకీయ నేతలు తలో రీతిలో హిందూ విశ్వాసులపై దాడికి దిగడం క్షమార్హం కాదు. జూలై 22 నుంచి ఆగస్టు రెండు వరకు కావడి యాత్ర కొనసాగుతుంది.   ప్రతి శ్రావణమాసంలో 11 రోజులపాటు కావడి యాత్ర నిర్వహిస్తారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో 250 కిలోమీటర్ల మేర సాగే యాత్రలో దాదాపు 5 కోట్ల మంది భక్తులు పాల్గొంటారు. అయితే  గతేడాది మాంసాహారం విక్రయించే కొందరు వ్యాపారులు కావడి యాత్ర నిర్వహించే దారుల్లో కావాలని గందరగోళం సృష్టించారు. భక్తుల విశ్వాసాలకు విఘాతం కలిగించి యాత్రను అపవిత్రం చేసి విధంగా వ్యవహరించారు. శాంతి భద్రతలను చేతులకు తీసుకొని చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తించారు. మొత్తంగా పూజను, యాత్ర పవిత్రతను దెబ్బతీసే విధంగా కుట్రలు చేశారు. అందుకే ముందు జాగ్రత్తగా ప్రభుత్వం, పోలీసులు చర్యలు చేపట్టింది. వ్యాపారుల నేమ్ బోర్డు తప్పనిసరి చేసింది.  భక్తులకు స్వచ్ఛమైన శాఖాహారం ఎక్కడ లభిస్తుందో సూచించేలా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు ఉత్తర్వులు తీసుకురావడం ప్రతి హిందువు స్వాగతిస్తున్నాడు. కన్వర్ యాత్ర దారిలో నేమ్ బోర్డు తగిలించాలని ఉత్తర్వులు మతపరమైనవి కావని, ఈ విషయంలో ఎవరు భుజాలు తడుముకోవాల్సిన పనిలేదు. తన పేరు తాము చెప్పుకోవడానికి గర్వపడాలి కాని, దాచి దాచిపెట్టాల్సిన అవసరం లేదు.


వ్యాసకర్త : పగుడాకుల బాలస్వామి,

ప్రచార ప్రసార ప్రముఖ్, విశ్వహిందూ పరిషత్.

9912975753

9182674010

 

Post a Comment

Previous Post Next Post