దీపావళి పండుగ ముఖ్య ఉద్దేశం ఆ ఒక్కరోజు సరదాగా టపాకాయలు కాల్చి, మిఠాయిలు తిని సంతోషంగా ఉండడం మాత్రమే కాదు. మన మనసు కూడా ఇలా ప్రతి రోజు ఆనందంగా ఉండాలని.
మన మనసు, శరీరం కూడా మతాబుల్లా ఉల్లాసంతో వెల్లి విరియాలని. దీపం నుంచి ప్రకాశవంతమైన వెలుగు వస్తుంది. చుట్టూ ఉన్న చీకటిని తరమేస్తుంది వెలుగు.
వెలుగంటే కేవలం బాహ్యంగా కనిపించేది మాత్రమే కాదు అంతరంగా ఉండేది కూడా వెలుగే. వెలుగంటే స్పష్టత.
జీవితంలో ఒక విషయంపై స్పష్టత ఉన్నప్పడు మాత్రమే జీవితంలో ఏర్పడిన చీకట్లు తొలిగిపోయి దీపాల లాగా వెలుగుల మయం అవుతుంది.
తనలో గూడు కట్టుకున్న చీకట్లను తొలగించుకుంటే వాటంతట అవే వెలుగులు విరబూస్తాయి. ఈవాస్తవాన్ని గుర్తు చేసేదే దీపావళి పండుగ.
యుగయుగానా దీపావళి
దీపావళి నాలుగు యుగాల్లోనూ నాలుగు విశేషమైన అంశాలున్నాయి.
1. క్రుతయుగంలో శ్రీమహావిష్ణువు వామన రూపంలో, బలిచక్రవర్తిని పాతాళానికి అణిచివేసిన రోజే దీపవళి. బలి రాజ్యం పోయినందుకు అప్పుడ ప్రజలు వేడుక చేసుకున్నారు.
2. త్రేతాయుగంలో రావణ వధానంతరం అయోధ్యలో శ్రీరాముడు రాజ్యసింహాసనాన్ని అధిష్టించాడు. అయోధ్యప్రజలు రామరాజ్యానికి గుర్తుగా దీపావళి పండుగ జరుపుకున్నారు.
3. ద్వాపరయుగంలో శ్రీక్రుష్ణుడు, తన భార్య సత్యభామ సహితుడై..నరకాసురుడిని సంహరించాడు. నరకాసురుడి వధకు సంతోషంతో ఈవిజయానికి గుర్తుగా దీపావళి జరుపుకున్నారు.
4. కలియుగంలో విక్రమశకానికి మూలమైన విక్రమార్క మహారాజు సింహాసనాన్ని అధిష్టించి కూడా దీపావళి రోజునే!
నాలుగు యుగాల్లోనూ నాలుగు ప్రముఖమైన కారణాలు ఉండడం వల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రజలు ఎంతో ఆనందోత్సాహాలతో ఆశ్వయిజ అమావాస్య రోజు దీపావళిని జరుపుకుంటున్నారు.