మాదాపూర్లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో టిఆర్ఎస్ ప్లీనరీ సోమవారం జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కెటిఆర్ ప్రసగించారు. వాటిలో ముఖ్యాంశాలు వార్తానిధి పాఠకుల కోసం ప్రచురిస్తున్నాం.
మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. ఏడాదిన్నర క్రితం భారత ప్రభుత్వం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. దేశానికి ఏం చేస్తే నయా భారత్‌ను నిర్మించవచ్చో.. సూచనలివ్వాలని కోరుతూ వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షుడు ప్రధానమంత్రి ఆహ్వానించారు. టిఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడిగా ఆ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ సీఎం కెసిఆర్ నాయకత్వంలో 3ఐ మంత్రా నడుస్తోంది. మొదటి ఐ ఇన్నోవేషన్, రెండో ఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మూడో ఐ ఇంక్లూజివ్ గ్రోత్.. మూడు గనక దేశవ్యాప్తంగా అమలు చేస్తే కచ్చితంగా నయా భారత్‌ను నిర్వహించవచ్చని ప్రధానమంత్రికి తెలిపానన్నారు.
ఏడేళ్లలో ఎన్నో పరిపాలన సంస్కరణలను సీఎం కెసిఆర్ తీసుకొచ్చారు. అధికారులు, పాలకుల చేతిలో దశాబ్దాలుగా బందీ అయిన అధికారాన్ని ప్రజల చేతికి అందించేందుకు, అవినీతి రహిత పరిపాలన చేసేందుకు సంస్కరణలను చేయడం జరిగింది. సంక్షేమ, అభివృద్ధి ఫలాలు పేదలకు నిరాటంకంగా అందడమే వాటి ఉద్దేశం.. తెలంగాణ అభివృద్ధిని నేడు దేశం మొత్తం చూస్తోంది. ఒకప్పుడు బెంగాల్ నేడు ఆలోచించేది భారతదేశం రేపు ఆలోచిస్తుందని ఒకప్పుడు అనేవారు. కానీ నేడు తెలంగాణ ఏం చేస్తుందో.. అది భారతదేశం రేపు చేస్తుందని అంటున్నారు. ఏడున్నరేళ్ల ప్రస్థానం, పరిపాలన సంస్కరణలకే ఒక స్వర్ణ యుగం. అన్ని రాష్ట్రాలకు సీఎం ఉంటారు.. మన రాష్ట్రానికి మాత్రం రాష్ట్రాన్నే తెచ్చిన సీఎం ఉన్నారు. అధికార వికేంద్రీకరణ ప్రజలకు అందాలనే ఉద్దేశంలో పది జిల్లాలను 33 జిల్లాలు చేశాము. 43 రెవెన్యూ డివిజన్లను 74వరకు వికేంద్రీకరించుకున్నాం. 459 మండలాలను 594 చేసుకున్నాం. 68 మున్సిపాలిటీలను 142 చేసుకున్నాం. 8690 గ్రామ పంచాయతీలు ఉంటే గిరిజన తండాలను కూడా గ్రామ పంచాయతీలు చేసి 12769కి పెంచాము. తద్వారా స్వయం పాలనా సౌలభ్యాన్ని అన్ని వర్గాల ప్రజలకు అందించాము.
పంచాయతీ రాజ్ చట్టంలో సంస్కరణలు ఎంతో మార్పును తీసుకొచ్చాయి. ఆదర్శ గ్రామ పంచాయతీ ఎక్కడ ఉందంటే ఒకప్పుడు వరంగల్ పక్కనున్న గంగదేవి పల్లి అని చెప్పేవారు. కానీ పల్లె ప్రగతి కార్యక్రమాలు ప్రారంభమైన తరువాత నిధులు, విధులు విడుదల చేశాక.. తెలంగాణలో ప్రతి పల్లె ఆదర్శ పల్లెగా మారింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డుల పంట పండుతున్న విషయాన్ని గుర్తు చేశారు. సీఎం కెసిఆర్ స్వయంగా రూపొందించిన కొత్త మున్సిపల్ చట్టం ద్వారా దశాబ్దాలుగా పేరుకుపోయిన అవినీతిని, మురికిని తొలగించాం.
ఏ రాష్ట్రమైనా సుఖసంతోషాలతో ఉండాలంటే.. శాంతిభద్రతలు పటిష్టంగా ఉండాలి. దానిని స్వరాష్ట్రంలో పటిష్టంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కెసిఆర్‌కే దక్కింది. గతంలో కేవలం రెండు పోలీసు కమిషనరేట్లు ఉంటే.. కొత్తగా మరో ఏడు కమిషనరేట్లు ఏర్పాటు చేసి.. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 9 పోలీసు కమిషనరేట్లను సీఎం కెసిఆర్ తీసుకొచ్చారు. తెలంగాణ శాంతిభద్రతల విషయంలో ఫస్ట్ ఇన్ సేఫ్టీ, బెస్ట్ ఇన్ సెక్యూరిటీ అనే విధంగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది.
ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం క్యాంప్ ఆఫీసులను నిర్మించింది. భూరికార్డుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక సంస్కరణలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ధరణి పోర్టల్ అందుబాటులోకి తెచ్చింది. భూరికార్డుల ప్రక్షాళన 95శాతం పూర్తైంది. యాజమాన్య హక్కులపై స్పష్టత వచ్చింది. టిఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ప్రతి చట్టం తెలంగాణ ప్రజల చుట్టం..
నీళ్లు నిధులు నియామాకాలు కేంద్రంగా సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం జరిగింది. రాష్ట్రం ఏర్పడిన తరువాత చిన్ననాటి వనరులు, పెద్ద నీటి వనరులు అనే వ్యత్యాసం లేకుండా అన్ని సాగునీటి వ్యవస్థలను, కాలువాలను, చెరువులను, ప్రాజక్టులను, చెక్ డ్యాంలను, ఆనకట్టలను, చిన్నాపెద్ద డ్యాం స్కీంలను ఒకే గొడుగు కిందకు తెచ్చి సాగునీటి శాఖను పునర్వవ్యస్థీకరించడం జరిగింది. విప్లవాత్మకమైన నిర్ణయం సాగునీటి రంగ ముఖ చిత్రాన్ని మార్చింది.
ఉద్యోగ నియామకాల కోసం నూతన జోనల్ వ్యవస్థను తీసుకొచ్చాము. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలో నియామక ప్రక్రియ పురోగతిలో ఉన్నది. 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయి.
మార్కెట్ కమిటీల్లో దళిత, బహుజన, మహిళల ప్రాతినిధ్యం పెంపొందేలా ప్రభుత్వం ప్రత్యేకమైన రిజర్వేషన్లు కల్పించింది. తద్వారా బడుగు, బలహీనవర్గాలకు చెందిన సోదరసోదరీమణులు మార్కెట్ కమిటీ చైర్మనులు కాగలుగుతున్నారు. పల్లెప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలు అద్భుతమైన ఫలితాలు సాధించాయి. లోకల్ బాడీస్ కోసం అడిషనల్ కలెక్టర్ అనే కొత్త పదవిని సృష్టించారు. తద్వారా అడిషనల్ కలెక్టర్‌కు కేవలం గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల ప్రగతి గురించిన బాధ్యతలను అప్పగించాము. విశేషమైన అధికారాలను ఇచ్చాము. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి ఠంచనుగా ప్రతి నెలా మొదటి తేదీకి కేటాయిస్తున్నాము. పల్లెల్లో 9355 పంచాయతీ సెక్రటరీలను నియమించాము. గ్రీన్ బడ్జెట్‌తో హరిత పల్లెలు, హరిత పట్టణాలుగా తీర్చిదిద్దే చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది.
తెలంగాణ ఏర్పడినప్పుడు కేవలం 7788 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఉండేది. కానీ సరఫరా చేయగలిగింది 5500 మెగావాట్లు మాత్రంగా ఉండేది. 2వేల మెగావాట్ల విద్యుత్ లోటుతో తెలంగాణ ప్రయాణం సాగింది. అయితే స్వల్ప సమయంలోనే 16425 మెగా వాట్ల విద్యుత్ సామర్థ్యానికి రాష్ట్రం చేరుకుంది. సోలార్ విద్యుత్‌లో తెలంగాణ దేశంలోని రెండో స్థానంలో ఉంది. తలసరి విద్యుత్ వినియోగంలో భారతదేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా ఉంది. నిరంతర విద్యుత్‌తో నిరంతర సంపద సృష్టి జరుగుతోంది.
టిఎస్ ఐపాస్ ద్వారా కంపెనీల స్థాపనకు మార్గం సుగమం అయ్యింది. ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. ఎర్ర బస్సు నుంచి ఎలక్ట్రిక్ బస్సు దాకా. ఎలక్ట్రిక్ బస్సు నుంచి ఎయిర్ బస్సు దాకా, ట్రాక్టర్ నుంచి హెలికాప్టర్ దాకా టైల్స్ నుంచి టెక్స్‌టైల్‌స్ దాకా, యాప్స్ నుంచి గూగుల్ మాప్స్ దాకా, అన్నింటికి గమ్యస్థానం తెలంగాణ రాష్ట్రమని గర్వంగా చెబుతున్నా.
మ్యానుఫాక్చరింగ్ రంగంలో తిరుగులేదు.. ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎదురు లేదు. ఫార్మా సెక్టారులో ఫస్ట్ ఉన్నాం. వ్యాక్సిన్ ప్రొడక్షన్లో ప్రపంచానికే తెలంగాణ రాజధానిగా మారింది. ఐటీ రంగంలో అద్భుతమైన విజయాలు సాధించాం.
అమెజాన్ యాపిల్ సంస్థలకు ఆయుపట్టు హైదరాబాద్.. ఫేస్‌బుక్ ఫేవరేట్ డెస్టినేసన్ హైదరాబాద్.. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రణాళికతో.. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ పట్టణాల్లో ఐటీ హబ్‌లను ఏర్పాటు చేశాం. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే కాదు.. ఐటీ అంటే ఇన్‌క్రెడిబల్ తెలంగాణ అనే సీఎం కెసిఆర్ నాయకత్వంలో తీర్చిదిద్దేందుకు పనిచేస్తున్నాం.
కట్టు కథలకు, పిట్ట కథలకు పరిశ్రమలు రావు.. కఠోర శ్రమ చేస్తే.. అవినీతి రహితంగా అనుమతులిస్తే.. రెడ్ టేపిజం పక్కన పెట్టి.. రెడ్ కార్పెట్ వెల్కం చెబితే పరిశ్రమలు వస్తాయి తప్పా.. ఆషామాషీగా రావు. పారిశ్రామిక ప్రగతిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. రీజనల్ రింగ్ రోడ్డుకు సీఎం కెసిఆర్ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా 348కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం వల్ల కొత్త పెట్టుబడులు, కొత్త పారిశ్రామిక కారిడార్లు, పారిశ్రామిక క్లస్టర్లు, ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి. పరిశ్రమలంటే టాటాలు మాత్రమే కాదు. పరిశ్రమలంటే తాతల నాటి కులవృత్తులు కూడా అనివాటికి కూడా పెద్దపీట వేసేది టిఆర్ఎస్ ప్రభుత్వం, పరిశ్రమలంటే బిర్లాలు మాత్రమే కాదు బోర్లా పడ్డ ఎంఎస్ఎంఈ పరిశ్రమలు అని.. వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని నమ్మేది టిఆర్ఎస్ ప్రభుత్వం. స్టార్టప్లకు పెద్ద పీట వేస్తున్నాం.
#TRSPleanary #MinisterKTR #CMKCR