ప్రపంచ దేశాలు హిందువులకు రక్షణ కల్పించాలని ఆర్ఎస్ఎస్ సేవకులు అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండలం వెలిజర్ల గ్రామంలో బంగ్లాదేశ్, పాకిస్థాన్‌తో పాటు భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లో జరుగుతున్న దాడులను ఖండిస్తూ నిరసన కార్యక్రమాన్ని జరిపారు.
ఈ సందర్భంగా స్వయం సేవకులు మాట్లాడుతూ.. భారతదేశ విభజన జరిగినప్పుడు పాకిస్థానులో ముప్పై శాతం వరకు హిందువులు ఉండేవారని తెలిపారు. నేడు వారి సంఖ్య రెండు శాతానికి పడిపోయిందని తెలిపారు. బంగ్లాదేశ్‌లో కూడా హిందువుల పరిస్థితి దీనంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రపంచంలో పదుల సంఖ్యలో ఇస్లామిక్ దేశాలున్నాయని.. అక్కడెక్కడ కూడా మైనారిటీలకు హక్కులు లేవని గుర్తు చేశారు. కానీ ఒక్క హిందూ దేశం కూడా లేదన్నారు. భారతదేశంలో హిందువులు మెజారిటీలు అయినప్పటికీ.. లౌకికవాదం పేరిట హిందువుల సంస్కృతి సంప్రదాయాలు.. ఆచార వ్యవహారాలు.. ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా విపరీతమైన మతమార్పిడులు జరుగుతున్నాయని ఆరోపించారు.
అటు ఇస్లామిక్ దేశాల్లో హిందువులకు రక్షణ లేదనుకుంటే.. ఇటు లౌకిక దేశమైన భారతదేశంలో కూడా మెజారిటీలైన హిందువులకు రక్షణ లేకుండా పోతోందని వివరించారు. సెక్యులర్ పార్టీలు మైనారిటీ సంతుష్టీకరణ కోసం బంగ్లాదేశ్.. పాకిస్థాన్.. మయన్మార్‌ల నుంచి ఇస్లామిక్ అక్రమ వలసలను ప్రోత్సహిస్తున్నాయని పేర్కొన్నారు. అందుకు ముఖ ద్వారంగా బెంగాల్ రాష్ట్రం మారుతోందని విమర్శించారు.
భారత విభజన అనంతరం కాశ్మీరి పండితుల నుంచి మొదలుకొని.. నేడు పశ్చిమ బెంగాల్ హిందువుల వరకు మైనారిటీల సంఖ్య పెరిగిన ప్రతిచోటా హిందువులకు రక్షణ లేకుండా పోతోందని బాధను ప్రకటించారు. హిందువుల పండుగలు.. ఆలయాలు.. దేవాలయాల ఆస్తులపై ఆధిపత్యం చలాయించే ప్రభుత్వాలు.. వక్ఫ్, చర్చి ఆస్తుల విషయంలో మాత్రం తమకేం పట్టనట్లు వ్యవహరిస్తాయని చెప్పారు. కేవలం మైనారిటీ సంతుష్టీకరణ రాజకీయాల కోసం దశాబ్దాలుగా మెజారిటీల అణచివేతను సెక్యులరిజం పేరిట విదేశి శక్తులు కొనసాగిస్తున్నాయని అన్నారు.
ఇప్పటికైనా హిందువులు.. వారి ఆడబిడ్డలు.. ఆలయాలు.. దేవాలయ ఆస్తులు.. సంస్కృతి.. సంప్రదాయాల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలని కోరారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సనాతన భారతీయ ధర్మాన్ని నిర్మూలించడం సరికాదని హితవు పలికారు. ప్రపంచంలో హిందువులు లేని రోజు.. విధ్వంసం.. వినాశనమే మిగులుతుందని సంఘ్ సేవకులు అభిప్రాయపడ్డారు. హిందువులు తమపై వివిధ రూపాల్లో జరుగుతున్న దాడులను గుర్తించి.. జాగృతం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సంఘ్ సేవకులు శ్రీకాంత్ కౌటిల్య, వెంకటేష్ దొడ్డల, రఘు అనిమి, హన్మంత్, ప్రదీప్, చందు, సాయిరామ్, యుగంధర్, వరుణ్, కె.వెంకటేశ్, శ్రీకాంత్ కేతావత్, రాజ్‌కుమార్, డి.పవన్, పి.రాజ్‌కుమార్, అట్ట లింగం, మంగళి నరేష్, మట్ట శ్రీశైలం, డి.రఘుపతి తదితరులు పాల్గొన్నారు.